Sunday, April 11, 2010

కవితా సంపుటి

స్నేహితులారా .. నా కవితా సంపుటి ని మీ ముందు ఉంచుతున్నాను .. మీ విమర్శలను , సలహాలను తెలుసుకోగోరుచున్నాను ...

స్నేహం ...

వసంత మాసం లో కోయిల గొంతులో ఎంత మాధుర్యం ఉంటుందో
నిండు పున్నమి రోజు పండు వెన్నెల ఎంత హాయిగా ఉంటుందో
తొలకరి చినుకుకి విరిసిన పువ్వులు ఎంత ఆనందం గా ఉంటాయో
స్నేహపు జల్లులో తడిసిన మనసులు కూడా అదే మాధుర్యాన్ని , అదే హాయిని , ఎంతో ఆనందం గా పంచుకుంటాయి


ఆశ ...

ఆ కోయిల పాట విని నువ్వు పిలిచావనుకున్నా
నా నిన్నటి కలను నమ్మి నిను గెలిచాననుకున్నా
నీ అలకను చూసి నను మరిచావనుకున్నా
అయినా !!! రేపటి కోసం నీకై ఆశ తో నిలుచున్నా


మన దేశం ...

నా సర్వ స్వాతంత్ర్య లౌకిక ప్రజాస్వామ్య గణ తంత్ర సామ్యవాద భారతావని లో
నేను అనే స్వార్థం నాట్యం చేస్తుంటే ..
మేము అనే మత మౌడ్యం మెలికలు పెడుతుంటే
మాది అని కుల తత్వం కుతంత్రాలు చేస్తుంటే
మానవత్వమన్న మాట కికడ మనుగడ కరువే కదా
మంచి మనసున్న మనుషుల కికడ బ్రతుకు బరువే కదా ..


గెలుపు ..

ఓ విద్యార్థి ..
మనసు లోని భావాలను మాటలలో తెలుపు
మనకు ఉన్న నమ్మకాన్ని చేతలలో చూపు
వయసుకున్న ఉత్సాహాన్ని మేధస్సు తో కలుపు
మన కోసమే వేచి ఉంది మరపు రాని గెలుపు

Wednesday, March 24, 2010

భారత దేశ ప్రజలకి కావలసిందేమిటి ???

ఉపోద్ఘాతం :- సీన్ ఏంటంటే రేసెంట్ గా నేను నా స్కూటర్ తో ఒక చిన్న సాహసం చేసి డాక్టర్ ని కలవాల్సి వచ్చింది.ఆ డాక్టర్ గారు కొంచెం పేరున్న డాక్టర్ కావటం తో ఒక గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది .. వెయిట్ చేయిస్తున్నందుకు ఆ డాక్టర్ ని తిట్టుకుంటూ అక్కడ టీ పాయ్ మీదున్న రామకృష్ణ ప్రభ పత్రిక ని అలా తిరగేసాను .. అందులో చూసిన వివేకానందుని ఆర్టికల్ గురించి ఇలా నా బ్లాగ్ లో ప్రస్తావిన్చాదలిచి .. ఇలా మీ మీదకు వదులుతున్నా .. సహనం తో భరించండి ..

భారత దేశ ప్రజలకి ఇప్పుడు ఆధ్యాత్మిక బోధనలు ,మత బోధనలు అవసరం లేదు.ఒక సగటు మనిషి తన కడుపు నిండిన తర్వాత మాత్రమే మతం గురించి దేవుని గురించి ఆలోచనలు చేస్తాడు.ఆ విధం గా మన దేశం లో ఎక్కువ మంది ఇప్పుడు ఆధ్యాత్మిక బోధనలు వినే స్థితి లో లేరు.వారు తమ పొట్ట నింపుకొనే పనిలోనే అహర్నిశం తలమునకలై ఉన్నారు.చాల మంది ఆ వేటలో ఓడిపోతున్నారు కూడా.ఇలాంటి స్థితి లో వారు ఆధ్యాత్మిక బోధనలను శ్రద్ధ తో వినలేరు , ఆ ఆసక్తి కూడా వారిలో కనిపించదు.భారత దేశానికీ నిజమైన బలం ఆ దేశ యువత మాత్రమే.వారు తలుచుకుంటే అసాధ్యమంటు ఏమి ఉండదు.ఓ భారత యువతా మేలుకో.నీ దేశానికీ ఏది అవసరమో గ్రహించి దానిని అందించటం నీ బాధ్యత అని మరిచిపోకు.మన జ్ఞానం మన దేశ అభివృధికి ఉపయోగపడని నాడు ఆ జ్ఞాన సముపార్జన కు అర్థం లేదు.అందుచేత జ్ఞానవంతులైన యువకులారా ... మీ జ్ఞానాన్ని మన దేశం లోని పల్లె పల్లెల వాడ వాడలా విస్తరించేలా కార్యోన్ముఖులు కండి.మీ తోటి భారతీయులకి జ్ఞాన సముపార్జన లో సహకరించి వారిని కార్యోన్ముఖులు చేసే బాధ్యత ని స్వీకరించండి.మీ జ్ఞానం తోటి భారతీయునికి కడుపు నింపేందుకు ఉపయోగపడితే అది దేశ భవితవ్యాన్ని ప్రభావితం చేసే సాధనం అని గ్రహించండి.ఇలా ప్రజలు చైతన్య వంతులు కానంత వరకు వారికి ఆధ్యాత్మిక చింతన అవసరం కాని ఆ బోధనల సారంశం కానీ అవగతం కాదు.

ఇదీ నేను అలా డాక్టర్ అప్పాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తునప్పుడు చదివింది .. ఈ లోగా నా turn రావడం తో డాక్టర్ ని కలిసి ,ఆయన రాసిచ్చిన టాబ్లెట్స్ కొని ఇంటికి చేరాను.కానీ నా మదిలో వివేకానందుని భావన మెదులుతూనే ఉంది ..

ఏదో ఒకటి దేశం కోసం చెయ్యాలనే తపనని పెంచుతోంది ఆ ఆలోచన ..

కానీ చూద్దాం .. కనీసం రాబోయే కాలం లోనైనా నా వంతు గా నేను ఏమైనా చెయ్యగల్గితే నా జన్మ ధన్యమే.అప్పుడు నేను వివేకానందుని పేరు ని తలుచుకునేందుకు కొంత అర్హత సాధించినట్టు అవుతుంది ..