Wednesday, May 23, 2018

* అవమానవత్వం *

తోటి మనిషికి ఊతమివ్వరు, నూతి కప్పలు ఓటి బ్రతుకులు
సాటి వారికి సాయమవ్వరు, అసూయ నిండిన అనసూయపుత్రులు
...
తన విధి తాను చేయటానికి లంచం, అది అందితే లేదంతకంటే మంత్రం
తన శోధన అవకాశం కోసం, పరుల సొమ్ములోకి పరకాయ ప్రవేశం

అతి తెలివి మీరి ,అసలు తెలివి మరచి
స్వార్ధార్జనలో మునిగి ,మురికి కూపంలో మూలుగుతున్నారు

అంతిమ విజయం న్యాయానిదే అని తెలిసీ, ఈ అతి తెలివి మనిషి మళ్ళీ అవినీతికే ఓటు వేస్తుంటాడు , వితండ తర్కాలు మోస్తూ

నేటి మనిషిలో మానవత్వం , నేతి బీరలోని నేతి చందం
నీతి శూన్యం,జ్ఞాన రహితం,పేరు ఘనం,అభిమతం అధమం

అవివేక సామ్రాజ్యానికి అతనే మకుటంలేని మహారాజు..

అతడిని చూసి జాలి పడదామా ? గేలి చెద్దామా ? లేక ఏదో ఒకటి చేసి దారిలో పెడదామా ?

ఈ 'అవమాన'వత్వం వీడి , కనీసం 'ఆదిమానవ'తత్వం ఆచరిద్దాం

కదలండి , అమ్ములపొదిని ఆసాంతం నింపుకొని
వదలండి , రొమ్మువిరిచి ధైర్యపు చాపాన్ని
విరచండి , అవినీతి చేపల వెన్ను వెయ్యి వ్రక్కలుగా
గెలిపించుకోండి , జన్మనిచ్చిన మన వేదభూమి అంతిమ తత్వాన్ని , విశ్వమానవ సౌభ్రాత్రుత్వాన్ని ..

సర్వ జన మంగళం ,సకల శుభదాయకం , వికల భావ నాశనం , అభినవ అద్వితీయ శకమారంభం ..

సర్వేజనా సుఖినోభవంతు ...

No comments:

Post a Comment